Monday, January 14, 2008

తనకి తమిళ్ రాదు

చాట్ రూం అంతా గొడవ గొడవ గా ఉంది ... కొత్తగా వచ్చిన వాళ్లని ఈ చాట్ కి addict చేసేలా జోరుగా సాగుతోంది సంభాషణ ల పరంపర. ఓ పక్క ఆ రూం కి నాయకుడి లాంటి మల్లిక్ , అందరూ నిజ జీవితం లో కలుసుకొంటే ఎలా ఉంటుంది అని పాత కాపులని అడుగుతున్నాడు .. నేను ఈ చాట్ కి రావడం చాల తక్కువయింది ..చాలా కొత్త పేర్లు కనబడుతున్నాయి ...జరిగే గొడవ నాకేమంత కొత్తగా అనిపించలేదు ..ఎప్పుడూ ఉండేదే .. అమ్మాయిల అబ్బాయిల గోల...
ఒకోసారి నిజ జీవితం కంటే ఈ virtual లైఫే సుఖం గా అనిపిస్తుంది ... ఇక్కడ ఎవరూ ఎవరికి తెలియదు ... నా గురించి నేను ఏం చెప్తే అది తప్ప వేరే విషయం తెలిసే అవకాశం తక్కువ ... కాని అమ్మయి పేరుతో వచ్చిన వారికి ఇక్కడ కూడా కష్టాలు ఉంటాయనుకొంటా పాపం .. కాకపోతే మనకి నచ్చని వాడిని ignore చేసుకొనే సదుపాయం ఉంది కాబట్టి అది ఆ కష్టాలని తేలిగ్గానే అధిగమిస్తారు కొంచెం తెలివి ఉన్న అమ్మాయిలు ...
తెలివితక్కువ అమ్మాయి has joined the room అని screen మీద ప్రత్యక్షమయింది
ఎవరబ్బా ఇంత తెలివి తక్కువ జీవి , అవతలి వాళ్లకి తేలిగ్గా దొరికిపోయే పేరుతో వచ్చింది అనుకొన్నా . వచ్చిన వెంటనే అందరు hi లు నమస్తే లు చెప్పారు .. తను కూడా అందరిని పలకరించి గొడవలో పాలు పంచుకొంటోంది
. "do u know her? " మల్లిక్ నుండి ప్రైవేట్
"nO ? "
" tta - meet chandra ..chandra is an old timer like me here. chandra this is tta ..well she is .... she is ..tta :P..what else can i say?" అని మల్లిక్ పబ్లిక్ మెస్సేజ్ పంపాడు ...
నమస్తే చెప్పి మళ్లీ గొడవలో మునిగిపోయా ..
"మల్లిక్ మీ గురించి చెప్పాడు " ప్రైవేట్ మెస్సేజ్
" ఏం చెప్పాడు ?"
"మీరు అందరిలా కాదుట "
"ఏదో మల్లిక్ దయ .... "
"మీరెక్కడ ఉంటారు ? "
" అమెరికాలో ఒక కుగ్రామం లో .. మరి మీరు?"
" చెన్నై లో? "
" ఓ .. ఎప్పుడి ఇరుక్కె?" నాకు తెలిసిన నాలుగు అరవ ముక్కలు ప్రయోగించా
" అంటే?"
" తప్పు అడిగానా? నాకొచ్చిన కొద్ది తమిళం ప్రయోగిస్తున్నా :D"
" ఓ నాకు తమిళ్ రాదు ..."
"ఎంత కాలం నుండి ఉంటున్నారు చెన్నై లో?"
"దాదాపు 15 years "
" అదేంటి తమిళనాడులో ఉండి తమిళం రాదు అంటున్నారు? తమిళ సోదరులు ఊరుకొంటున్నారా?"
"మీరేమి చేస్తున్నారు? "
"చాట్ చేస్తున్నా :D " అతి తెలివి
"అది కాదు ఏం పని చేస్తారు?"
" అందరూ చేసేదే ... రాబోయే తరానికి పనికొచ్చే software రాస్తుంటా ( అని మా బాస్ అనుకొంటాడు)"
ఇక sw engg కష్టాలు , సుఖాలు అన్నిటి గురించి అడిగి తెలుసుకొన్నారు .. మాటల్లో తేలిసిన విషయాలు .. తనకి నా కన్న 5-6 ఏళ్ల చిన్న వాడయిన కొడుకు ఉన్నాడని ..తను భర్త చేసే వ్యాపారంలో సహాయం చేస్తారని ...మనం చేడ్డీలేసుకొనే రోజుల్లోనే తను బి.ఏ ( ఇంగ్లీషు) అని ...
ఇక అది మొదలు కొన్నాళ్లు దాదాపు రోజూ చాట్ లో మాట్లాడే వారు తను ... ఎక్కువగా technology కి సంబంధించిన విషయాలు తనకి తెలియనవి అడిగి తెలుసుకొంటూ ఉండేవారు .. ఓసారి ఎవరికో పంపబోయి తనకి వాయిస్ చాట్ ఇన్విటేషన్ పంపితే వెంటనే లాగవుట్ అయిపోయారు .. కొన్నాళ్లు తను చాట్ లో కనపడలేదు .... ఉన్నట్టుండి ఒక రోజు కనిపించారు .
"మీరెప్పుడైనా చాట్ లో మాట్లాడే వాళ్లని కలిసారా?" ప్రైవేట్ మెస్సేజ్
" ఒక సారి కొందరం కలిసాం"
"కలవడం మంచిదే అంటారా? "
"ఎవరిష్టం వాళ్లది .. మంచనుకొంటే మంచి ..కాదనుకొంటే కాదు"
"ఒకవేళ మీకు కలవడం ఇష్టం లేదనుకోండి .. మీరేం చేస్తారు?"
"నాకు కుదరదు అని చెప్తా"
"మరి నేను అలా చెప్తే అందరూ ఎందుకు నాతో మాట్లాడటం మానేసారు?"
"చిన్న పిల్లలు కద :D అంతే"
"ఏమో నాకు చాట్ కి రావాలంటే భయమేస్తుంది"
"బయట ఎలాగూ పక్కనోడు ఏమనుకొంటాడో అనుకొని బతకడమే అవుతుంది.. ఇక్కడ కూడా అలానే భయాలా?"
"కదా ..నాకూ అలానే అనిపించింది "
"మరింకేం ..భయపడకుండా రండి""ప్రయత్నిస్తా"
"good, ఇంకేంటి సంగతులు?"
"చెప్పాలి మీరే... ఇంట్లో అందరూ టీవీ కి అతుక్కుపోయారు..క్రికెట్టు..మీరు చూస్తారా? "
"వస్తే చూస్తాం .. అయినా ఇప్పుడు పనిలో ఉన్నాం కద.. మరి మీరెందుకు చూడటం లేదు"
"నేను TV చూడను "
చాట్ పరిచయం మామూలుగానే నడిచింది చాన్నాళ్లు...
కొన్నళ్లకి చాట్ చేయడం మానేసినా,తను అప్పుడప్పుడు messenger లో మాట్లాడుతూ ఉండే వారు ..
ఓరొజు యాహూ లో కనపడితే పలకరించా ... మాములు పరిచయాలు, ఎలాఉన్నార్లు అయిపోయాక .. ఆ కొన్నాళ్ల updates share చేసుకొన్నాక ఇంకేం మాట్లాడటనికి లేనప్పుడు ..
"chini kam చూసారా?"
"నేను సినెమాలు చూడను ... మా అబ్బాయి ఏమైన download చేసి పక్కన కూచొంటే తప్ప "
"?"
"నాకు వినపడదు .... మా వాడు పుట్టినప్పటి నుండి నాకు వినికిడి పోయింది "
అప్పటికి కాని నాకు అర్ధం కాలేదు తనకి తమిళ్ ఎందుకు రాదో ....